Home  »  Featured Articles  »  తెలుగు సినిమా పాటకు కొత్త సొబగులు అద్దిన డా. సి.నారాయణరెడ్డి!

Updated : Jul 29, 2025

(జూలై 29 సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా..)

‘తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది..’, ‘గాలికి కులమేదీ.. నేలకు కులమేదీ..’, ‘నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు..’ అంటూ జాతిని మేల్కొలిపే పాటలు, ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని..’, ‘వగలరాణివి నీవే..’, ‘అంతగా నను చూడకు..’ అంటూ ప్రేమను పలికించే పాటలు, ‘అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి..’, ‘ఓ నాన్నా.. నీ మనసే వెన్న..’, ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా..’ అంటూ సెంటిమెంట్‌తో నిండిన పాటలు.. ఇలా సందర్భం ఏదైనా, సన్నివేశం ఏదైనా.. తన కలం నుంచి అలవోకగా అక్షరాలు జాలువారతాయి. ఆ పాటలు విన్న శ్రోతల మనసులు ఆనందంతో వెల్లివిరుస్తాయి. విభిన్నమైన శైలి, మనసును తాకే భావజాలం ఆయన రచనల్లో కనిపిస్తుంది. ఆయన ఎవరో కాదు.. డా. సి.నారాయణరెడ్డి. సాహిత్య రంగంలో లబ్ధప్రతిష్టులుగా పేరు పొంది, ఆ తర్వాత సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేసిన మహా రచయిత సి.నారాయణరెడ్డి. అందరూ ఎంతో అభిమానంతో సినారే అని పిలుచుకునే ఆయన రచనా రంగంలో,  సినీ రంగంలో సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.

1931 జూలై 29న కరీంనగర్‌ జిల్లాలోని హనుమాజీపేటలో మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు సింగిరెడ్డి నారాయణరెడ్డి. ఆయన ప్రాథమిక విద్య అంతా ఒక వీధిబడిలోనే జరిగింది. చిన్నతనంలో హరికథలు, జానపదాలు, జంగం కథలపై ఎక్కువ ఆసక్తి చూపించేవారు. ప్రాథమికోన్నత విద్య నుంచి డిగ్రీ వరకూ ఉర్దూ మీడియంలోనే చదువుకున్నారు సినారె. తెలుగు అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. అందుకే ఉర్దూ మీడియంలో చదువును కొనసాగిస్తూనే తెలుగు భాషపై సాధన చేస్తూ పట్టు సంపాదించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి డాక్టరేట్‌ కూడా పొందారు. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో లెక్కకు మించిన గ్రంథాలు చదివారు. జలపాతం, విశ్వగీతి, నాగార్జున సాగరం, అజంతా సుందరి, కర్పూర వసంతరాయలు వంటి రచనలు చేసి, తెలుగు సాహితీప్రియులను ఆనందసాగరంలో మునకలు వేయించారు. సినారె రచించిన ‘విశ్వంభర’ కావ్యానికి ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్‌ అవార్డు లభించింది. విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ్‌ అవార్డు అందుకున్నారు సినారె. గేయ కావ్యాలు, గేయ నాటికలు, కవితలు, సినిమా పాటలు.. ఇలా ఎన్నో రచనలు చేసి సాహిత్య రంగానికి విశేష సేవలు అందించారు సినారె. ప్రారంభంలో సికింద్రాబాద్‌లోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి, అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవుల్లో కొనసాగారు.

సి.నారాయణరెడ్డి కవితా వైభవం గురించి తెలుసుకున్న ఎన్‌.టి.రామారావు ఆయన్ని సినిమా రంగానికి ఆహ్వానించారు. తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న గులేబకావళి కథ చిత్రంలో పాటలు రాయమని కోరారు. దానికి సినారె ఒక షరతు పెట్టారు. తన తొలి సినిమా కాబట్టి అన్ని పాటలూ రాసే అవకాశం ఇస్తే రాస్తానని చెప్పారు. దానికి ఎన్టీఆర్‌ కూడా అంగీకరించి ఆ సినిమాలోని 11 పాటలు సినారెతో రాయించారు. ఆయన రాసిన తొలి సినిమా పాట ‘నన్ను దోచుకుందువటే.. వన్నెల దొరసాని..’. ఆయన రాసిన ఈ పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

సినారె రాసిన తొలి సినిమాలోని పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. దాంతో బి.యన్‌.రెడ్డి, కె.వి.రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, వి.మధుసూదనరావు, కె.ప్రత్యగాత్మ వంటి ప్రముఖ దర్శకులు తమ సినిమాలకు కూడా పాటలు రాయించుకున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ తన తొలిచిత్రం ‘ఆత్మగౌరవం’ మొదలుకొని ‘జీవనజ్యోతి’ వరకు ప్రతి చిత్రంలోనూ సినారెతో పాటలు రాయించుకున్నారు. తర్వాతి రోజుల్లో విశ్వనాథ్‌ తన సినిమాల్లోని పాటలను వేటూరి, సిరివెన్నెలతో రాయించుకున్నప్పటికీ అవసరమైన సమయంలో స్వాతిముత్యం, స్వాతికిరణం వంటి చిత్రాలకు మళ్ళీ సినారెతోనే గీతరచన చేయించడం విశేషం. ఇలా ఎందరో సినారె పాటకు పట్టాభిషేకం చేశారు. దాసరి, కోడి రామకృష్ణ వంటి దర్శకులు సైతం తమ చిత్రాలలో సినారె పాటకు ప్రత్యేక స్థానం కల్పించారు. కొందరు నిర్మాతలు సినారె పాట లేకుంటే సినిమానే తీయమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో సినారెకు మంచి అవకాశాలు ఇచ్చారు ఎన్‌.టి.రామారావు. శ్రీకృష్ణపాండవీయంలో ఆయన రాసిన స్వాగతం.. సుస్వాగతం.. పాటను ఇప్పటికీ సంగీత ప్రియులు ఆస్వాదిస్తున్నారు. ఇదేనా మన సంప్రదాయమిదేనా.., జయీభవా విజయీభవా.. వంటి ఎన్నో పాటలు సినారె కలం నుంచి జాలువారాయి. ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించిన చివరి చిత్రం సామ్రాట్‌ అశోక లోనే కాదు, ఆయన నటించగా విడుదలైన ఆఖరి సినిమా శ్రీనాథ కవిసార్వభౌముడులోనూ సినారె పాటలు రాశారు. ఇలా తను ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్ళ నుంచి చివరి వరకు ఎన్టీఆర్‌తో మంచి అనుబంధాన్ని కొనసాగించారు సినారె. 

సాహిత్యరంగంలో చేసిన సేవలకుగాను ఎన్నో పురస్కారాలు సి.నారాయణరెడ్డిని వరించాయి. సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ్‌ అవార్డు, కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌లతో పాటు కేంద్ర ప్రభుత్వం అందించే పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలు సినారెకు లభించాయి. సీతయ్య చిత్రంలోని ఇదిగొ రాయలసీమ గడ్డ.., ప్రేమించు చిత్రంలోని కంటేనే అమ్మ అని అంటే ఎలా.. పాటలకు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డులు అందుకున్నారు. 1997లో అప్పటి రాష్ట్రపతి.. సినారెను రాజ్యసభ్యుడిగా నామినేట్‌ చేశారు. చివరి వరకూ ఏదో ఒక సినిమాలో తను మాత్రమే రాయగల ఎన్నో పాటలు రచించారు సినారె. 2017లో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్‌ 12న తుదిశ్వాస విడిచారు డా.సి.నారాయణరెడ్డి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.